జర్నలిస్టులంటే ఏమాత్రం గౌరవం లేని విజయసాయిరెడ్డి మీడియా రంగంలోకి రావాలనుకోవడం దురదృష్టకరం
అమరావతి :
వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ మేరకు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, ఉపాధ్యక్షులు బోడపాటి సుబ్బారావు బుధవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేతగా, పెద్దల సభలో అనుభవం కలిగిన మీకు ఎప్పుడు ఏమి మాట్లాడాలో తెలియదా అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, హుందాగా మాట్లాడాలని ఆయనకు తెలియదా….?తెలుసు, తెలిసి కూడా అహంకారం, అధికారదర్పం ఆయన ఇంకా మరిచి పోలేదు అనుకుంటా…, ప్రస్తుతం నువ్వొక మాజీవి, అధికారం కోల్పోయిన చచ్చిన పాము లాంటివాడివి, కోరలు పీకిన సర్పానివి, ఇక తమరు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది అని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు హెచ్చరించారు.
మిమ్ములను ప్రశ్నించిన ఎవరినైనా వ్యక్తిగత దూషణలు చేయడం మీకు ఆనవాయితీగా వస్తోందన్న విమర్శలు గత ఐదేళ్లుగా ఎదుర్కుంటున్న సంగతి ముందు తెలుసుకోండి. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. వైసీపీ 2024 అట్టర్ ప్లాప్ అవ్వడానికి కూడా నీవే కారణం అని, నువ్వొక రాజకీయ విషనాగువి అని మీ పార్టీవారే తమరిని ఈసడించుకుంటున్నారు. ఇవి గమనించుకుని నోట్లో నీళ్లు పోసుకుని గమ్మున కూర్చుంటే మంచిదని రంగనాయకులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. మీడియా ప్రతినిధులపై నోరు పారేసుకున్న ఏ రాజకీయ నాయకుడు కూడా మరీ ఇంతగా దిగజారిన దాఖలాలు లేవు అని ఆయన అభిప్రాయపడ్డారు. మీపై కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ధైర్యంగా సమాధానం చెప్పాలే గానీ .., తమరిని ప్రశ్నించి.. మీ సమాధానం రాబట్టుకోవాలి అనుకున్న జర్నలిస్టులను పేరు పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడితే తమరి “కారు కూత”లకు బెదిరిపోయే వాళ్ళు కాదు మా తెలుగు జర్నలిస్టులు. ప్రశ్నించడం మా హక్కు, ప్రశ్నించలేనప్పుడు మేమెలా జర్నలిస్టులం అవుతాం. అసలు సమస్యను పక్క దారి పట్టించేలా ఏవేవో మాట్లాడుతూ మీడియా ప్రతినిధులపై నోరుపారేసుకోవడం అత్యంత నీచం.. హేయం. ఇంగిత జ్ఞానం లేకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాలుగవ పిల్లర్ గా ఉన్న మీడియా ప్రతినిధులమైన జర్నలిస్టులను తమరు మాట్లాడుతున్న తీరు పద్ధతి కాదు. జర్నలిస్టులంటే ఏమాత్రం గౌరవం లేని మీరు మీడియా రంగంలోకి రావాలనుకోవడం దురదృష్టకరం అన్నారు. జర్నలిస్టులను అరే… ఒరే… ఏరా… వాడు … అంటూ ప్రెస్ మీట్ లో దిగజారిపోయి మాట్లాడారు. ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాలి. చెప్పని పక్షంలో జర్నలిస్ట్ సంఘాల జె.ఏ.సీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడానికి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘంగా తాము ముందుంటామని రంగనాయకులు తెలిపారు. ఇకనైనా వైఖరి మార్చుకుని వెంటనే రాష్ట్రంలో తమ మనో భావాలు దెబ్బతినకుండా జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాలి అని రంగనాయకులు డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులుగా విజ్ఞత లేని వ్యక్తిగా వ్యవహరించిన తమరి తీరు సరికాదు అన్నారు. నేనింతే అనే నియంత వైఖరిని విడనాడాలని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా హితవు పలికారు.
అటువంటి మీడియా సమావేశాలను బహిష్కరించండి
మీడియా సమావేశాల్లో మైకులు కనబడగానే బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులమని మరచి ఇష్టారీతిన మాట్లాడడం ఇటీవలి కాలంలో సాధారణమైపోయింది. ఈ పద్ధతి మారాలి. జర్నలిస్టులు కూడా సదరు విషయం.. నిజమా.. కాదా తెలుసుకుని, మంచి విషయమైతే, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే మైకులు పెట్టండి. వ్యక్తిగత విషయాలను, వ్యక్తిగత అభిప్రాయాలు, కోపంతోనో.. ఆవేశం తోనో మాట్లాడే వారి వద్ద మైకులు పెట్టొద్దు. ఆ మీడియా సమావేశాన్ని సాధ్యమైనంత వరకు బహిష్కరిస్తూ ఉంటే మరోసారి ఎవరూ కూడా విజయసాయిరెడ్డి లా దిగజారిమాట్లాడరు. కావున జర్నలిస్టులు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని మేడవరపు రంగనాయకులు సూచించారు.